పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం దేశీయ ఇంధన మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. వరుసగా పెరుగుతున్న డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)పై భారీ ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.60 లక్షల అదనపు వ్యయం అవుతోంది.
ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు రోజుకు సగటున 38 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ఐదు కిలోమీటర్లకు ఒక లీటర్ డీజిల్ వినియోగిస్తున్నట్లు లెక్కిస్తే, రోజువారీ డీజిల్ వినియోగం 7.60 లక్షల లీటర్లకు చేరుతోంది. వారం క్రితం వరకు లీటరు డీజిల్ ధర రూ.87.72 ఉండగా, మే 25 నాటికి అది రూ.95.61కి పెరిగింది. దీంతో ప్రతి లీటరుపై రూ.7.89 అదనపు భారం పడుతోంది.
ఇప్పటికే కాలం చెల్లిన బస్సులు, పెరిగిన ప్రయాణికుల రద్దీ, నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీకి ఈ ధరల పెరుగుదల మరింత సంక్షోభాన్ని తెచ్చిపెడుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం నెలకు దాదాపు రూ.18 కోట్ల అదనపు భారం పడుతోంది. భవిష్యత్తులో డీజిల్ ధరలు మరింత పెరిగితే ప్రయాణికుల చార్జీలు పెంచే పరిస్థితి తప్పదని అధికారులు సూచిస్తున్నారు.
ఇక అద్దె బస్సుల యజమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీ, ఓవర్‌లోడ్ కారణంగా మైలేజ్ తగ్గిపోయిందని, గతంలో 100 లీటర్లతో నడిచిన దూరానికి ఇప్పుడు 130 లీటర్లు అవసరమవుతున్నాయని చెబుతున్నారు. అద్దె రేట్లు పెంచకపోతే సర్వీసులు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.
డీజిల్ ధరల పెరుగుదల కొనసాగితే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.