హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును.. బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.

జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును. బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతిచెందిన వ్యక్తిని తిరుపతికి చెందిన రిటైర్డ్ డీఎస్పీ కుమారుడు అశోక్‌రెడ్డిగా గుర్తించారు. ఆయన మృతి వార్తతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ప్రాథమిక విచారణలో అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇటీవల జాతీయ రహదారులపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ల అలసట, అధిక వేగం వంటి కారణాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రయాణ సమయంలో భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.