అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీసులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో కీలక ముఠా సభ్యుడు సహా 14 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ Jagadish బుధవారం మీడియాకు వెల్లడించారు. గంజాయి వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక మెడికల్ కిట్లతో అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, కొందరికి పాజిటివ్ రావడంతో విచారణ చేపట్టారు.
వారి నుంచి లభించిన సమాచారంతో పోలీసులు పక్కా ప్రణాళికతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. కొంతమంది పోలీసు సిబ్బంది గంజాయి వినియోగదారుల మాదిరిగా ముఠా సభ్యులను సంప్రదించి, చిన్న ప్యాకెట్లలో గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం సాక్ష్యాధారాలతో ముఠాను పట్టుకున్నారు.
అరెస్టయిన వారిలో పిషాకి సురేష్(36), షికారి మల్లన్న(43), షికారి భరత్(31), షికారి పరశురాం(55), షికారి రవి(36) పాత నేరస్థులుగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, షికారి సురేష్ Guntakal Railway Station కేంద్రంగా గంజాయి నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడు. స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి నుంచి కిలోకు రూ.10 వేల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి, సహచరుల సహాయంతో అనంతపురం నగరానికి తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.