విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా భావించిన పోలీసులు కేసును National Investigation Agency కు అప్పగించాలని నిర్ణయించారు.

ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో పలువురు నిందితులకు ఇతర రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులకు లేఖ రాశారు.

ఇక విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ అధికారులు కూడా ఈ కేసుపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కేసును అధికారికంగా టేకోవర్ చేసి సంబంధిత కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అనంతరం పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించనున్నారు.

ఈ కేసులో అరెస్టయిన నిందితుల కాల్ డేటా, ఆన్‌లైన్ కమ్యూనికేషన్, బ్యాంక్ లావాదేవీలు, హవాలా కోణాలు, ఇతర రాష్ట్రాలతో ఉన్న అనుబంధాలపై ఎన్‌ఐఏ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అలాగే నిందితులకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన నెట్‌వర్క్ ఏదైనా ఉందా..? అనే కోణాల్లో కూడా లోతుగా విచారణ జరపనుంది.

కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు.