చెవిరెడ్డి కుటుంబ సభ్యులపై నాలుగు గంటల విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే Chevireddy Bhaskar Reddy కుటుంబ సభ్యులను ఈడీ అధికారులు విచారించారు.

ఈరోజు చెవిరెడ్డి భార్య లక్ష్మీకాంతమ్మతో పాటు కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలు ఈడీ ఎదుట హాజరయ్యారు. గతంలో జారీ చేసిన నోటీసుల మేరకు వారు విచారణకు వచ్చినట్లు సమాచారం. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ విచారణలో భారీ ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, హవాలా మార్గాలపై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా, మోహిత్ రెడ్డి A39గా నమోదయ్యారు. 2021 నుంచి 2023 మధ్య కాలంలో సుమారు రూ.63.72 కోట్ల విలువైన ఆస్తులను కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. అయితే అధికారిక రికార్డుల్లో మాత్రం రూ.8.85 కోట్ల విలువ మాత్రమే చూపినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

అలాగే KVS ఇన్‌ఫ్రా ద్వారా నిధులు రూటింగ్ చేశారనే ఆరోపణలపైనా ఈడీ ప్రత్యేకంగా ఆరా తీసింది. 2019 నుంచి 2024 వరకు జరిగిన లావాదేవీలపై బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

మద్యం వ్యాపారాలు, లైసెన్సుల కేటాయింపుల వ్యవహారంలో చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరు రాజకీయ ప్రముఖులు, అధికారులు పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశముండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.